వెళ్ళాలా ?? ఏమౌతుందో ?
అడగాలా ??? అడిగితే ఏమో ??
మాట్లాడాలా ?? వినకపోతే ఎలా ??
హాయ్ చెప్పాలా ?? చూసి చూడక పోతే ??
చూడాలా ?? నచ్చుతుందో లేదో ??
చెయ్యాలా ?? సరిగ్గా రాక పొతే ??
నవ్వాలా ?? పిచ్చి అనుకుంటే ??
ఏడవాలా ?? కన్నీళ్లు వస్తే ??.....
అనుకున్నది , అనిపించింది చెయ్యకపోతే ...
ఉన్న ఒక్క జీవితాన్ని పూర్తిగా జీవించకపోతే ...
సందిగ్ధపు మజిలీ దాటేదెప్పుడు నేస్తం ??
ఏదీ మారదు ఎవరూ మార్చరు,
మార్పు రావాలి నీలోనే అది తెలుసుకో నేస్తం !!
ఈ క్షణం నీది మరుక్షణం ఎక్కడో,
దిగంతాల యుద్ధం నీవే.. నీతోనే..
గెలుపు ఓటమి కాదు- పోరాటం నీవై సాగిపో నేస్తం !!
ఎవరి కోసం ఈ ఎదురు చూపు,
ఎందుకోసం నీ వెతలు,
నీ తోడై నీడై వచ్చేది నీతో నీవే ...
అనుమానపు సంకెళ్ల ఆకాంక్షల పంజరాన్ని ఛేదించి,
ఎగసి పడే తరంగాల ఊర్ధ్వాలను అందుకో నేస్తం !!
నిన్ను నువ్వు గా తెలుసుకొని మసలుకో నేస్తం ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి