మొత్తం పేజీ వీక్షణలు

6, ఏప్రిల్ 2018, శుక్రవారం

మోక్షం

ఆడించే నాటకం లో పావులం మనమే .. 
ఆట తెలుసుకోలేని నేను నువ్వు లీనమై .. 
అధ్బుతంగా రమణీయంగా .. 
అడుగడుగునా .... నేనే అనుకుంటూ .... 
నింగీ నేలా అంచుల్లో విహరిస్తూ ... 
నిగ్గు తేల్చలేని నిజాన్ని 
కనీ కనిపించక దోబూచులాడే భయాన్ని ,
కలబోసి వడబోసి కడతేర్చే ఆశల్ని ,
లోపలి పొరల్లో నిక్షిప్తంగా భద్రపరుస్తూ ... 
లోతైన గుహల్లో మగ్గ పెడుతూ ... 
తైతక్కలాడే మనస్సుకు ,
తైత్తరోపనిషత్తు చదివిస్తూ ... 
సాగుతూ ... సాగిపోతూవున్న జీవచ్ఛవానికి మోక్షమెప్పుడో !!! ???


5, ఏప్రిల్ 2018, గురువారం

మాలచ్చిమి

రాత్రి చీకట్లు వీడకుండానే నిద్ర లేచే మాలచ్చిమి 
కట్టే వెలిగించే గంజి వారకుండానే 
ఉల్లి మిర్చి నంజుకు పెట్టి 
కోడి కూతకు ధీటుగా నాలుగు దిక్కులా 
గడపలా ద్వారాలూ దాటి 
కన్నబిడ్డ , ముసలి ముతకాను  ను వదలి 
మగని కి ధీటుగా తోడుగా బయలెల్లి 
పొలము గట్టున  వడి వడి గా పోతుంటే 
బల్లకట్టు బుడతడు ఆవలి గట్టు కు చేరేసి 
నడుము వంచి నడుమ ఎకసెక్కాలే చేసి 
పంట చేను మడి అంతా తిరిగే 
గొంతు లార్చే నడి నెత్తి  సూరీడు  
పిల్ల కాలువ తడిపే సందె చీకట్లు 
కూని రాగపు పైరు నిలువెల్లా ముంచే 
నింపే లచ్చిమింట వరి కంకు గోదాము 
గంగి గోవును కొలిచే పసుపు కుంకుమ హారతులతో 
కడుపులు నింపే చెమటోడ్చిన కొడవలితో .. 
ఊరంతా పండుగలే మాలచ్చిమి దీవెనలతో .. 

సంతృప్తి లేని సాగరం

ఆటల్లో పాటల్లో భయమేమిటో తెలియని బాల్యంలో ... 
రేపు ఎందుకో నిన్న ఏమిటో కాని  
ఇప్పుడెందుకో ఈ నిమిష మేమిటో 
నేటి మేటి ఆనందం హద్దు లేమి తో   
గడిపేసిన కాలం !!
తెలియాలి తెలుసుకోవాలి అనే నకళ్లు 
నేర్చుకోమని నేర్పించే ప్రలోభాలు 
మెల్లిగా అతి మెల్లగా లోకపు పోకడల 
అగచాట్లతో జారిపోయే !!
మచ్చుకైనా ప్రస్తుతం లో లేక  జ్ఞాపకాల పొరల్లో ... 
జ్ఞానం అంటూ తలకెక్కిన నకిలీ భూషితాలు 
బరువెక్కిన భారమైన జీవితాలు 
విదిల్చలేక, దించలేక .. సంతృప్తి లేని సాగరంలో ... 
సందిగ్ధావస్థలో కొట్టు  మిట్టాడుతున్నావా నేస్తం !!!

4, ఏప్రిల్ 2018, బుధవారం

నిన్ను నువ్వు తెలుసుకో నేస్తం !!

వెళ్ళాలా ?? ఏమౌతుందో  ?

అడగాలా ??? అడిగితే ఏమో ??
మాట్లాడాలా ?? వినకపోతే ఎలా ?? 
హాయ్ చెప్పాలా ?? చూసి చూడక పోతే ??
చూడాలా ?? నచ్చుతుందో లేదో ??
చెయ్యాలా ?? సరిగ్గా రాక పొతే ??
నవ్వాలా ?? పిచ్చి అనుకుంటే ??
ఏడవాలా ?? కన్నీళ్లు వస్తే ??.....

అనుకున్నది , అనిపించింది చెయ్యకపోతే ...
 ఉన్న ఒక్క జీవితాన్ని పూర్తిగా జీవించకపోతే ...
 సందిగ్ధపు మజిలీ దాటేదెప్పుడు నేస్తం ??

ఏదీ మారదు ఎవరూ మార్చరు, 
మార్పు రావాలి నీలోనే అది తెలుసుకో నేస్తం !!

ఈ క్షణం నీది మరుక్షణం ఎక్కడో, 
దిగంతాల యుద్ధం నీవే..  నీతోనే.. 
గెలుపు ఓటమి కాదు- పోరాటం నీవై సాగిపో నేస్తం !! 

ఎవరి కోసం ఈ ఎదురు చూపు,
ఎందుకోసం నీ వెతలు,
నీ తోడై నీడై వచ్చేది నీతో నీవే ...  

అనుమానపు సంకెళ్ల ఆకాంక్షల పంజరాన్ని ఛేదించి,
ఎగసి పడే తరంగాల ఊర్ధ్వాలను అందుకో నేస్తం !!
నిన్ను నువ్వు గా తెలుసుకొని మసలుకో నేస్తం ... 


భావ కవిత

ఉదయించే సూరీడు చీకట్లను చీలిస్తే ,
అస్తమించే భానుడు నిశీధిని ఆహ్వానిస్తే, 
పగలు రాత్రి కి మధ్య వేకువ సంధ్య లు మేలుకొలుపులైతే .. 
ప్రక్రుతి పరవశాలు జీవితానికి అద్దం పడితే .. 
చూసే కళ్ళకు అనుభూతి కి మధ్య మౌనం తోడైతే .. 
ఆస్వాదించే కళలు నీలో వుంటే ... 


మనసు ఉప్పొంగదా .. నీ భావం కవితై విలసిల్లదా !!!


తలరాతలు

ఆలోచనలు అందరి సొత్తూ 
నచ్చేవే , అనుకున్నవే  అభిప్రాయాలు 
ఏకీభావం ఏకైక భావం మదిలో ఉంటే 
అరచేతి గీతల్ని మార్చలేని నువ్వు 
ఎవరి తలరాతల్ని రాయగలవు మిత్రమా !! 



నాటకం

వేల గొంతులు వేవేల ప్రకంపనలు, 
వణుకు పుట్టించే చరిత్రలు ,
శిధిలమైన ఆర్భాటాలు, 
సమసిపోయిన అంతరంగాలు, 
మాసిపోయిన గాథలు, 
ఇంకిపోయిన కన్నీటి చుక్కలు, 
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ  ఒక్కటే ... 
క్రొత్తగా జరుగుతున్నది ... పాతగా జరిగిపోయినది .. 
పాత్రలు మారినా చరిత్రలు మారవు , 
చిద్విలాసంగా నిలిచే ప్రక్రుతి సాక్షిగా!!! 
కథలు గా మనముందు మన వెనుక అంతే తేడా! 
ఈ నటన ఎప్పుడు ఆగుతుందో .. నాటకం ఎప్పటికి ముగుస్తుందో ?? 

30, మార్చి 2018, శుక్రవారం

నిన్ను మార్చేదెవరో!!

ముప్పొద్దులా మునిగి తేలే జీవితాలకి 
ముంగిట వాలే పండు ఆకు 
మోరలు చాచే లేత చిగురు 
మరులు గొలిపే మేఘ మాల 
మైమరపించే కవన కువ కువ 
మేరు శిఖరపు మంచు ముసుగు 
ముద్ద మందారపు తీపి పిలుపు 
వినలేని చెవులు, కనలేని కన్నులు 
వున్నా లేని నిన్ను మార్చేదెవరో !! మురిసేదెవరో !!! 

"విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు"

ఎన్నో సంప్రదాయాలు , ఎన్నో రుచులు  మరింకెన్నో అభిరుచులు మేళవించి, మరో క్రొత్త సంవత్సరం లో మరిన్ని మంచి ఆలోచనలతో మామిడి పూత, క్రొత్త బెల్లం, చింతపండు , ఉప్పు , కారం మేళవింపు తో ,విళంబి నామ సంవత్సరం అందరి జీవితాల్లో సరిక్రొత్త ఉత్సాహాన్ని , ఉత్తేజాన్ని కలిగించి ,ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొని ప్రశాంతమైన మనసులతో నూతన సంవత్సరం సాగాలని కోరుకుంటూ "విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు"

--- నాగమణి పగడాల 

స్వేచ్చ

మోయలేము బరువులు దించలేము  
వినలేము అడగకుండా  ఆగలేము 
చూడలేము కళ్ళు మూసి  బ్రతకలేము 
నడవలేము పరుగెత్తకుండా ఊరుకోము 
చేయలేము ఎదుటి వాడిని అభినందించలేము 
మాట్లాడలేము స్వసుఖాన్ని వదులుకోలేము 
ఎక్కలేము అసూయాద్వేషాల్ని తొక్కలేము 
దిగలేము పైపై మెరుగులు చెరపలేము 
ప్రతి అడుగూ అడుసే 
ప్రతి మునకా మురుగే 
నదిలో పారేదెపుడో  !!! స్వేచ్చను స్వచ్ఛంగా పొందేదెపుడో ???

శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు !!!

క్రొత్త సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి,  
అర్ధరాత్రి స్వాతంత్రం తో స్వేచ్చా పాటలు పాడుతూనే ఉంది.. 
రాజకీయ పార్టీలు పుడుతూనే వున్నాయి, 
అహింసా సత్యాగ్రహాల మ్రోత మ్రోగుతూనే ఉంది ..
ఒక్కోరోజు ఒక్కో వార్త ప్రచురితమౌతూనే వున్నాయి, 
సమాజపు ప్రక్షాళన జాబితా పెరుగుతూనే ఉంది... 
లక్షల కోట్ల గొంతులు అరుస్తూనే వున్నాయి, 
పుస్తకాల ఉపన్యాసాల వెల్లువ కొట్టుకు పోతూనే ఉంది ...
చెప్పేది చేసేది కష్టం, 
మన సుఖం మనది అనుకోవడం ఇష్టం ..
నేను నాది న్యాయం, 
కాదు కూడదంటే అన్యాయం ...
వేలెత్తి చూపడం బాధ్యత, 
నిన్ను నువ్వు చూసుకోవడం అసమర్ధత.. 
వెరపు లేని జీవితం !! వెలితి దాని సంతకం!! 
రాముడొస్తాడని  రామబాణం వేస్తాడని ..
చీకట్లను చీలుస్తాడని ..
నవమి రోజు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడని ఆకాంక్షిస్తూ ...
శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు !!!

నిశ్శబ్దం

రోజు గడుస్తోందా !!  రోజులో ఇన్ని గంటలు ఎటు పోయాయో ?
ఎన్నో చెయ్యాలి !! ఏది చేసినా అసంతృప్తే ?
ఏదో జరగాలి !!!    జరగ బోయేది తలచి భయాందోళనలే ?
ఏమిటో కావాలి !! ఎందుకో తెలియక తికమక ?
ఎక్కడో ఆశలు  !!  ఎక్కని జారుడు బల్ల ప్రయాసలు?
వర్తమానం అనుమానం, భవిష్యత్తు అయోమయం 
ఆలోచన ఆగదు , ఆరాటం తప్పదు ..  
కాలం తో పోటీ పడే ఆలోచనలు,  అక్కరకు రాని మీమాంసలు ... ???
ఆగని కాలంతో నేస్తమైతే .. నిమిషం నిశ్శబ్దం నీవైతే .. పోయేదేముంది నేస్తం?

నీ ఉనికి

ఎగిరే పక్షి కి తెలుసు తన ఉనికి ఏమిటో !!
పెరిగే మొక్కకి తెలుసు తన బలమేమిటో !!
వీచే గాలికి తెలుసు తన పయనమెటో !!
పారే నీటి కి తెలుసు తన గమ్యమేమిటో !!
జారే వెలుగు కి తెలుసు తన నెలవెక్కడో !!
పూచే పువ్వు కి తెలుసు తన తావు ఏమిటో  !!
మూసే చీకటి కి తెలుసు తన స్థాన మేమిటో !!


అన్నీ తెలుసనే మనిషి కి బ్రతుకు భారమెందుకో ???


కలలు కనే కళ్ళు

ఆకాశం తాకాలని , మేఘాలతో ఆడాలని .. 
చందమామతో కూర్చున్న పేదరాశి పెద్దమ్మ కధలు వినాలని ... 
నక్షత్రాల మాలలల్లి కొప్పులో తురమాలని ... 
విహంగాల రెక్కలతో భూమ్యాకాశపు అంచులు తాకాలని .. 
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం రుచి చూడాలని ... 
నెమలి నడకల ఇంద్రధనుస్సు తో  నాట్యమాడాలని ... 
పూల రంగులతో మదిని నింపాలని ... 
సెలయేటి పద ఝరి లో ఆటలాడాలని ..  కలలు కనే కళ్ళు .. 
నీలోని నీరవాన్ని నిద్ర లేపకపోతే, విశ్వాసాన్ని నింపకపోతే  !!! 


వాస్తవం  లో సాకారం కై  ప్రయత్నం లేని  కలలు నీకెందుకోయ్ ???

అనుమానపు సంకెళ్లు

వెళ్ళాలా ?? ఏమౌతుందో  ?

అడగాలా ??? అడిగితే ఏమో ??
మాట్లాడాలా ?? వినకపోతే ఎలా ?? 
హాయ్ చెప్పాలా ?? చూసి చూడక పోతే ??
చూడాలా ?? నచ్చుతుందో లేదో ??
చెయ్యాలా ?? సరిగ్గా రాక పొతే ??
నవ్వాలా ?? పిచ్చి అనుకుంటే ??
ఏడవాలా ?? కన్నీళ్లు వస్తే ??.....

అనుకున్నది , అనిపించింది చెయ్యకపోతే ...
 ఉన్న ఒక్క జీవితాన్ని పూర్తిగా జీవించకపోతే ...
 సందిగ్ధపు మజిలీ దాటేదెప్పుడు నేస్తం ??

ఏదీ మారదు ఎవరూ మార్చరు, 
మార్పు రావాలి నీలోనే అది తెలుసుకో నేస్తం !!

ఈ క్షణం నీది మరుక్షణం ఎక్కడో, 
దిగంతాల యుద్ధం నీవే..  నీతోనే.. 
గెలుపు ఓటమి కాదు- పోరాటం నీవై సాగిపో నేస్తం !! 

ఎవరి కోసం ఈ ఎదురు చూపు,
ఎందుకోసం నీ వెతలు,
నీ తోడై నీడై వచ్చేది నీతో నీవే ...  

అనుమానపు సంకెళ్ల ఆకాంక్షల పంజరాన్ని ఛేదించి,
ఎగసి పడే తరంగాల ఊర్ధ్వాలను అందుకో నేస్తం !!
నిన్ను నువ్వు గా తెలుసుకొని మసలుకో నేస్తం ... 



15, మార్చి 2018, గురువారం

చైత్ర కుసుమాంజలి

వసంత ఋతువు తో కొత్త చిగురు 
కొత్త చిగురుతో కోయిలమ్మ పాట 
కోయిలమ్మ పాట తో క్రొత్త సంవత్సరం 
క్రొత్త సంవత్సరం తో తెలుగోడి వెలుగు  
తెలుగోడి వెలుగు తో చిత్త నక్షత్రం 
చిత్త నక్షత్రం తో  పౌర్ణమి మెరుపు 
పౌర్ణమి మెరుపు తో నులివెచ్చని సొగసు 
నులివెచ్చని సొగసుతో  ప్రకృతి పరవశం 
ప్రకృతి పరవశం తో కుసుమాల మకరందం 
కుసుమాల మకరందం తో పులకరించే పుడమి 
పులకరించే పుడమి తో వ్యాపించే అమృత వర్షిణి 
అమృతవర్షిణి కి ఇదే చైత్ర కుసుమాంజలి !!!

ప్రేమ

ప్రేమ తో మొదలై, 
మొహం తో బందీ అయ్యి,
 స్వార్ధం తో కలిసి ,
అంచనాలతో తారుమారై ,
పగలతో రగిలి, 
పట్టుదలలతో పొగిలి ,
ఆనందాన్ని మరచి,
చివరి దశలో వగచి , 
నీకు నీవే ఆహుతి అవుతున్నావా నేస్తం !!!    

8, మార్చి 2018, గురువారం

వందనము అమ్మా !!!!

మోసిన , నడిపించిన చెయ్యి , 
ఆడపిల్ల అంటూ వాళ్ళ పిల్లే  అయ్యి  ...
అర్ధభాగం తో కలిసి వచ్చేసిన చెయ్యి ... 
 చేతులు మారి రాతలు మార్చి  ..  
చక్రం లో తానూ ఒక అణువై .. 
సృష్టి కి ప్రతి సృష్టి చేసే నీకు వందనము అమ్మా !!!! 
 

బంధాలు బంధుత్వాలు

అమ్మవు నీవే ఆలివి నీవే 

అత్తవు నీవే అక్కవు  నీవే

కూతురు నీవే కోడలివి నీవే 

పిన్నివి నీవే పెద్దమ్మ వి నీవే 

చెల్లివి నీవే వదిన వి నీవే 

బంధాలు బంధుత్వాలు పుట్టుకతో వచ్చేవి కొన్ని అయితే 

ప్రయాణం లో కలిసేవి ఎన్నో ... 

ఎన్ని వున్నా ... ఎన్ని కలిసినా .. 

నిన్ను నువ్వు చూసుకుంటే ఎక్కడ నువ్వు ? ఏది నువ్వు ? 

6, మార్చి 2018, మంగళవారం

వసంత పంచమి

ముని మాపు వరకు రాగాలతో  కొమ్మ మీది కోయిలమ్మ 
మేఘాల  మెరుపులతో ధారగా కురిసే వాన చినుకు 
గాలి రెప రెపలతో ఆకులు లీలగా తలలు వాల్చే పైరు 
విరిసీ విరియని సుమాల నునుసిగ్గులు 
చిగురు చిగుళ్లతో బోసి నవ్వుల వసంతం 
రాధాకృష్ణుల ప్రేమ సాగర రంగేళి కి 
జీవితపు ఇంద్రధనుస్సు రా రమ్మని 
పూల రంగుల్లో తడిసి మురిసే పంచమి ఈ వసంత పంచమి 

28, ఫిబ్రవరి 2018, బుధవారం

జీవనాలు

మూసిన వెలసిన మెరిసిన  కలవని రంగులు 
తెలిసి తెలియని కోరిన కోర్కెల  హంగులు 
మాటున మేటుగా  చాలీ చాలని ఆశలు 
చోరుని జారుని జల్లెడ జిల్లనే సాకులు  
ఆగని ఆపని వీడని వదలని కర్మలు 
మోటుగా ధీటుగా  పోటెత్తిన దారుణ శక్తులు 
మెండుగా నిండుగా పొగిలే  జిత్తుల పొత్తులు 
ఎత్తుకు పైఎత్తులు సర్వం స్వాహా కుయుక్తులు 
అల్లి బిల్లిగా అల్లిన వెల్లువ జీవనం  
రంగుల, హంగుల, ఆశల, సాకులతో ... 
శక్తుల, పొత్తుల, కుయుక్తుల జీవనాలు !!!

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సంవత్సరాలు దొర్లుతున్నాయి

సంవత్సరాలు దొర్లుతున్నాయి ఆగని క్షణాలతో ఆపలేని మలుపులతో ..

          ఆకలితో అలమటించే కడుపులు ఒక ప్రక్క,

          యుద్ధం తో ఆటలాడే ప్రాణాలు మరో ప్రక్క,

           కోపాలకు, ద్వేషాలకు, ఆవేశాలకు నిలయమైన మనసులతో,

                            అదుపులేని ఆశలతో ...

సంవత్సరాలు దొర్లుతున్నాయి ఆగని క్షణాలతో ఆపలేని మలుపులతో ..

            రంగుల కలలు ., రాజీ లేని బ్రతుకులు...

            ఛాయా చిత్రాల జ్ఞాపకాలు నిన్ను నిలదీసే ప్రశ్నలు ..

            నేనే అనుకుంటూ భరోసాతో నీడల్లో దేవులాటలు ...

                          ఎదగలేని భావాలతో ...

సంవత్సరాలు దొర్లుతున్నాయి ఆగని క్షణాలతో ఆపలేని మలుపులతో ..

               రాశి చక్రాల తిరుగలి లో నలుగుతూన్న జీవితాలు ..

                 తుది మొదలు తెలియని జన్మల అంతరాలు ..

                 మొహాల ముసుగుల్లో మాయల భ్రమల నాటకాల్లో ..

                        ప్రోగుచేసుకున్న కర్మల వైకుంఠపాళి  తో ..

సంవత్సరాలు దొర్లుతున్నాయి ఆగని క్షణాలతో ఆపలేని మలుపులతో .. 

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాత లో (లే)ని క్రొత్తని కాలం సాక్షి గా ... ఋతువుల సమాగమం లో అలరించే ప్రకృతి శాసించే క్రీడకి మరోసారి స్వాగతం పలుకుతూ ... ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

--- నాగమణి పగడాల - 2018

నీతో నువ్వు లేవు

నీతో నువ్వు లేవు - ఎరుకలేక  నీ చిత్రం ఏ క్షణాన మార్చుకుందో.. 

నీలో వున్న నువ్వు - ఇంకెవరి ముసుగు లో మునుగుతుందో ..

నీకు వున్న నువ్వు -  నిన్ను కాని నిన్ను గా మసలుతుందో ..

నిన్ను నీకై మోసిన గర్భం - నీ అంతిమ యాత్రను మోసేదెవ్వరో..

నిన్ను కాచిన చీము నెత్తురు లో -  నీవై వేడిన మొర నెరవేరేదెన్నడో..

నిన్ను మరచిన నువ్వు - నిన్ను గా నువ్వు  తెలుసుకునేదెన్నడో  !!!! 

నూతన సంవత్సర శుభాకాంక్షలు

సంవత్సరం లో ఒక సంఖ్య మారింది. 
జీవితంలో ఒక సంవత్సరం వెనక్కి మరలింది.
అడుగులు నూతన సంవత్సరాన్ని నూతనోత్సాహంతో పరుగులతో ఆహ్వానిస్తోంది. 
మనిషి కి తగ్గిన జీవిత కాలం.. అసంపూర్ణం తో పూర్ణా ని కై పరిభ్రమణ ... 
శాంతితో, దేవుని ఆశీస్సులతో చల్లగా వుండాలని మనసారా కోరుకుంటూ ;;;
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.  :)

రోజూ లానే ఈరోజు కూడా

"ఈరోజు గడిస్తే చాలు... 
మన పనులు మనమే చేస్తున్నాం ... 
ఎవరినీ తప్పు పట్టడం లేదు.. 
ఏమీ తప్పు చెయ్యడం లేదు ... 
నేను శుద్ధమైన మనిషిని ... 
ఒకరి గొడవ నాకెందుకూ ??????
ప్రతిరోజూ గడిచిపోతూనే ఉంది ... గమ్యం లేకుండా ... అగమ్యంగా ... రోజూ లానే ఈరోజు కూడా ... :)

అన్నీ నువ్వని తెలిసీ

ప్రతి కదలికలోనూ నువ్వే 
ప్రతి శ్వాస లోనూ నువ్వే 
ప్రతి నిశ్చలత్వంలోనూ నువ్వే 
అచంచలంలోనూ నువ్వే 
ప్రతి అణువులోనూ నువ్వే 
ప్రతి కణం లోనూ నువ్వే 
అన్నీ నువ్వని తెలిసీ ... నిన్ను తెలుసుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యమో !!! 

చంద్రుడిని చూడాలా !!

చంద్రుడిని చూడాలా !! వెన్నెలని తాకాలా!!
వెండి వెలుగుల్ని చూడాలా ....  ఆనందపు  మువ్వల్ని తొడగాలా ... 
కరిమబ్బుల్ని మీటాలా .. మేలి ముసుగుల్ని తీయాలా .. 
రాత్రి మల్లెలు  పూయాలా ...  కంటి వెలుగుల్ని  నింపాలా .. 
నిశీధి దొంతరలు కురియాలా ... నిర్నిద్ర కలల్ని మోయాలా .. 
చీకటి చిరు  స వ్వ ళ్ళు  వినాలా ...  మనస్సు కలతల్ని మరవాలా .. 
చలి చీకటి మోయాలా ... మది మౌనం దాల్చాలా ... 
కాగడాలు వెలగాలా ...   సుదూర గమ్యం చేరాలా !!!!

ఒంటరి ప్రయాణం


పుట్టేటప్పుడు ఒంటరివే - పోయేటప్పుడు ఒంటరివే 
పుట్టినా  - గిట్టినా --- మారని , మార్పురాని, మార్చలేని విధి వ్రాతని మార్చే ఒంటరి శక్తి నీవైతే 
ఏడిస్తే నీతో ఏడ్చే , నవ్వితే నీతో నవ్వే నీ ఆప్తమిత్రుని కౌగిలి నీవైతే  
నీకై వేచి , నీతో కలిసి , నీవై పోయే నీ నీడ నీతో వుంటే 
              ---- జీవితపు బాటలో డస్సి పోని  ఒంటరి ప్రయాణానికి భయమెందుకోయ్ 
మనసు పొరల్లో కదిలే జ్ఞాపకాల, అనుభవాల దొంతరలు నిను గిలిగింతలు పెడుతుంటే 
కమ్మని కలల సాకారాల సృష్టి నీ కనురెప్పల్లో నాట్య మాడుతుంటే 
చీకటి సిత్రాలకు వెలుగుల వేదాలకు సాక్షివి నీవే అయితే 
రేపటి భయం లేదు, నిన్నటి దిగులు లేదు .. నేటి రోజు నీదే అనుకుంటే 
           ---- నింగి నేల కలిసే దారిలో సాగే ఒంటరి ప్రయాణానికి భయమెందుకోయ్ 
ఈర్ష్య అసూయల భేషజాల విరాగి నీలో చిద్విలాసియై విరాజిల్లుతుంటే  
మానసమందిరం లో అనంత విశ్వాకారుడు మది అర్చనా కుసుమాల దోసిలి నిండుగా నిన్ను నీవు అర్పిస్తుంటే 
         ---- ఆరాటపు అనంతాల ఈ ఒంటరి ప్రయాణానికి భయమెందుకోయ్ 

కిటికీ


ఉదయపు సుప్రభాత వేకువని,
సూర్యుని వెలుతురితో ఛాయని,
వర్షపు ధారలతో మేఘాన్ని,
చందమామ వెలుతురులో మలయా మారుతాన్ని,
పండు వెన్నెల జిలుగులతో నక్షత్రాన్ని,
నిశ్శబ్ధ నిశీథిలో మౌనాన్ని ... 

            ప్రకృతి తో మనల్ని అలరించే కిటికీ .. 
             ఇంటింటి కిటికీ ఇంపైన కిటికీ ... 
              నీ ఇంటి నా ఇంటి తెరచిన కిటికీ !!

బాల్యపు మురిపాల కేరింతలు,
యవ్వనపు సొగసుల పలవరింతలు,
ప్రౌఢపు వన్నెల కేళిరింతలు,
వృద్ధాప్యపు ముడతల భాష్యాలు,
పెళ్లి పేరంటాళ్ళ పండుగలు,
మొదటి చివరీ మజిలీలు..... 

              ఎదిగే ఒదిగే సందళ్ళు చూసిన కిటికీ ... 
              ఇంటింటి కిటికీ ఇంపైన కిటికీ ... 
              నీ ఇంటి నా ఇంటి తెరచిన కిటికీ !!

కలతలనీ .. కన్నీళ్ళనీ ... 
సంతోషాలనీ ... సంకటాలనీ .. 
మనసులనీ ... మమతలనీ ... 
జీవిత చరిత్ర ఊసుల్ని .... ఇంటి గుట్టులనీ.. 
వంట ఇంటి ఘుమ ఘుమలనీ ...  వచ్చే పోయే బాటసారులనీ .. 
బజారున పోయే కూరలమ్మి నీ ... జోరుగా సాగే దుమ్ములాటనీ ...  

                 గాలి వాటుగా తెచ్చే వేగుల కిటికీ .. 


                ఇంటింటి కిటికీ ఇంపైన కిటికీ ... 
              నీ ఇంటి నా ఇంటి తెరచిన కిటికీ !!

సందె

సూర్యుడే సొమ్మసిల్లె
ఆకాశం సోలి పోయే
కిల కిల రావాలే గూళ్ళు చేరే
పొట్ట కూటి  మేనులే డస్సి పోయే
పడమటింట పొగ పైకి ఎగసే
చిత్రమైన జగతి రోజు కుంగే
ధరిత్రి కొంగు చాచి ఊయలయ్యే
చీకటి కి  వెలుగు కి మధ్య వారధయ్యే
ప్రకృతి చేతిలో మనసు మూగబోయే
భాష లేని బాసలే చేసి పోయే
అత్యంత ప్రీతి గుండె లో నిండిపోయే ....

ఏది సత్యం?

ఏది సత్యం? మాటలా !!!.. చేతలా !!!.. రోజులా !!! క్షణాలా !!! కరిగిపోయే కాలానికి .. కాలిపోయే శలభాలు ... సాక్ష్యం తో బూడిద .. శాశ్వతం లో సూన్యం ????

కంప్యూటర్ జాబుల గోల

అమెరికా జాబులంటే బోలెడన్ని డబ్బులంటూ 
y2k తో టిక్కు టిక్కు లోళ్లు విరగబడి సముద్రాలు దాటినారు  
కలలు కనే లోకం ఇంజనీరింగ్ చదివేసి 
మోజు లోన విమానమెక్కి 
9/11 తో బిక్కచచ్చి పోనారు .. 
లాంగ్వేజ్ అంటూ కొత్త కొత్త పేరులతో 
ముప్పులే తెచ్చారు 
పొట్ట కూటి కోసం కోటి విద్యలే నేర్చినారు 
కనిపెట్టి నోడికేమి ఎరుక మితి మీరిన తిప్పలు 
నేర్చుకుంటే తెలుస్తది మతి లేని సుద్దులు
ఈరోజొచ్చిన టెక్కు తో 
10 సంవత్సరాల అనుభవం  కావాలంటాడు 
ఏదున్నా లేకున్నాఅన్నీ కావాలంటాడు 
అన్నీ వున్నా నీకు లేనిది సిటిజెన్ అంటాడు 
లక్కు తో పోరాడి నిక్కుతూ నీలుగుతూ 
EAD లు వచ్చి జాబులుంటే చాలు నంటూ 
దున్నుకుంటూ దోచుకుంటున్న బడా బాబులకెరుక
offshore మోతుబరుల చీట్లాటలు 
ఏడకొచ్చామో ఎందుకొచ్చామో మరిచిపోయి  
పోలేక ఉండలేక చితికి నాడు అమెరికా డాబులోడు ... 
  

కుసుమ హేల

మందార మంటుంది మనసునిమ్మని,
 మల్లె మెరిసింది మంచి పంచమని,
 కనకాంబరం కులికింది సాయమివ్వమని,
 లిల్లీ గొంతు కలిపింది పెళ్లి పాటనే నేనని,
 విరజాజి విరిసింది సంధ్య కి వెలుగునని,
 చామంతి ఊగింది జారే జలతారు నేనని,
 బంతి ముద్దులాడింది చెక్కిళ్ళ మెరుపు నేనని, 
మొగలి రేకు విప్పింది సుగంధాల పూత నేనని,
 సంపెంగ మేను వాల్చింది గగనాల లోగిలి నేనని,
 తామర నాట్య మాడింది మాలిన్యమంటని మేలిమి నేనని,
 కలువ ఎగసింది వెన్నెల్లో విరిబోణిని నేనేనని,
 గులాబీ నవ్వింది పూల రాణి ని నేనేనని,
 గడ్డి పువ్వు నేర్పింది స్వేఛ్ఛా సౌధాన్ని నేనని..

అక్కడా ఇక్కడా ఎక్కడ నేను ?

ఈ రోజు అనుకున్నవి రేపు మాసిపోయి,
ఆరోజు అనుకోనివి ఈరోజు జరిగిపోయి..
ఏనాడూ తలచుకోనివి మాపటికి మొదలయి ..
అదుపులేని ఆలోచనలు మాటల తూటాల్లో జారిపోయి..
ఆశల మోహంలో పరుగులాట సాగిపోయి..
కనిపించే లోకంతో పోరాటం వేగిపోయి..
అదా ఇదా ఏది నాది ? అక్కడా ఇక్కడా ఎక్కడ నేను ?

మాయ - మోహం

మరుగేలనో మరులొలికే మనసుకు,
మాట ఏలనో ఆడించే కనురెప్పకు,
మీమాంస ఎందుకో మైమరిచే గుండెకు,
మోద మెందుకో విహరించే కల్పనకు,
మోహ మేమిటో స్పందించే రసగుణకు,
మేని వెరపు ఎలాగునో వికసించే విలక్షణకు,
మద మత్తు ఎందుకో మ్రోడువారే విరాగిణికి ..???

నీరాజనాలు

పస లేని పోకడలతో,
ముగిసిన కాలపు ముద్రలతో ,
పోయిన జాతర గురుతులతో ,
మిగిలిన ఆశలతో , గుండెల్లో కరగని భయాలతో,
క్షణమొక యుగంగా , యుగమొక నిరీక్షణ గా ,
నిరంతర శోధనలో,
ఈడ్చుకుంటూ సాగే జీవితం లో ,
పుట్టీ గిట్టే ఒంటరి బ్రతుకు కు నీరాజనాలు ఎందుకో ??