మొత్తం పేజీ వీక్షణలు

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

ఒంటరి ప్రయాణం


పుట్టేటప్పుడు ఒంటరివే - పోయేటప్పుడు ఒంటరివే 
పుట్టినా  - గిట్టినా --- మారని , మార్పురాని, మార్చలేని విధి వ్రాతని మార్చే ఒంటరి శక్తి నీవైతే 
ఏడిస్తే నీతో ఏడ్చే , నవ్వితే నీతో నవ్వే నీ ఆప్తమిత్రుని కౌగిలి నీవైతే  
నీకై వేచి , నీతో కలిసి , నీవై పోయే నీ నీడ నీతో వుంటే 
              ---- జీవితపు బాటలో డస్సి పోని  ఒంటరి ప్రయాణానికి భయమెందుకోయ్ 
మనసు పొరల్లో కదిలే జ్ఞాపకాల, అనుభవాల దొంతరలు నిను గిలిగింతలు పెడుతుంటే 
కమ్మని కలల సాకారాల సృష్టి నీ కనురెప్పల్లో నాట్య మాడుతుంటే 
చీకటి సిత్రాలకు వెలుగుల వేదాలకు సాక్షివి నీవే అయితే 
రేపటి భయం లేదు, నిన్నటి దిగులు లేదు .. నేటి రోజు నీదే అనుకుంటే 
           ---- నింగి నేల కలిసే దారిలో సాగే ఒంటరి ప్రయాణానికి భయమెందుకోయ్ 
ఈర్ష్య అసూయల భేషజాల విరాగి నీలో చిద్విలాసియై విరాజిల్లుతుంటే  
మానసమందిరం లో అనంత విశ్వాకారుడు మది అర్చనా కుసుమాల దోసిలి నిండుగా నిన్ను నీవు అర్పిస్తుంటే 
         ---- ఆరాటపు అనంతాల ఈ ఒంటరి ప్రయాణానికి భయమెందుకోయ్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి